తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇవాళ్టితో నామపత్రాల దాఖలుకు గడువు ముగియనుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీ ఫాంలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తామని తెలిపింది. ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయనుండగా ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీన పొలింగ్ జరగనుండగా.. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. గజ్వేల్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్లో మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు సహా.. పలువురు మంత్రులు, పలు పార్టీల నేతలు ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1077 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటితో కలుపుకుంటే.. మొత్తం 2 వేల 265 చేరినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.