మధ్యప్రదేశ్ లో హైదరాబాద్ వాసుల రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు తెలంగాణ కు చెందిన వ్యక్తులు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని,
గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించినట్లు తెలిపారు. ఇక రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్ తోనూ మాటాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించానని వివరించారు. అంతేగాక బాధిత కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించడం జరిగిందని కేంద్రమంత్రి వెల్లడించారు.