రెండు నెలలకు పైగా కొండెక్కిన టమాటా ధరలు ఒక్కసారి దిగిరాగా… ఇప్పుడు ఉల్లి జనాలను కలవరానికి గురిచేస్తుంది. గతవారం నుంచి ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల్లోనే కిలోకు రూ. 10మేర పెరగడం గమనార్హం.
రైతు బజార్లలో కిలో రూ. 30 వరకు పలుకుతుండగా… మాల్స్, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో రూ. 35 నుంచి రూ. 40 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే కిలోకి సగటున 150 శాతం పైగా ధర పెరగడం గమనార్హం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం ఉత్పత్తిపై ప్రభావం చూపింది. అటు, పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను కొత్త పంట ఇంకా చేతికి రాలేదు.
కాగా, ఉల్లి ధరల పెరుగుదలపై కొనుగోలుదారులను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కొనలేనివాళ్లు కొన్నాళ్లు ఉల్లిని తినడం మానేయాలంటూ మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ఉచిత సలహానిచ్చారు. ఎక్కువ ధరకు ఉల్లి కొనుగోలు చేయలేని వారు కొన్ని నెలలపాటు వాటిని తినకుంటే ఎలాంటి వ్యత్యాసం ఉండదని పేర్కొన్నారు. రూ.10 లక్షల విలువైన కారును ఉపయోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధర కంటే రూ.10- రూ.20 ఎక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయొచ్చని అన్నారు. ఒకవేళ పెరిగిన ధరల ప్రకారం ఉల్లిని కొనుగోలు చేసే స్థోమత లేకపోతే.. రెండు, మూడు నెలలు వాటిని తినకుంటే ఎలాంటి తేడా ఉండదని అనుచిత వ్యాఖ్యలు చేశారు.