రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరు. అదే ఇద్దరు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకులు పోటీ పెడితే ఎలా ఉంటుందో చూడాలంటే ఒకసారి ధర్మవరం నియోజకవర్గం గురించి తెలుసుకోవాలి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి ఓడిపోయారు. 2019 లో వైసీపీ నుంచి సత్తా చాటి…ధర్మవరంపై పట్టు సాధించారు.
ఇక గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రాష్ట్ర ప్రజలను, రాజకీయ నాయకులను తన వైపు తిప్పుకున్నాడు. ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు కావలసిన అవసరాలను తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాడు. టిడిపి తరఫున పరిటాల రవి కుమారుడు అయినా పరిటాల శ్రీరామ్ పేరును యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ తండ్రి ఆశయాలకు, రాజకీయాలకు వారసుడు. ఘాటైన స్పీచ్ తో ప్రజలను తన వైపు తిప్పుకోగల సమర్థుడు శ్రీరామ్. సొంత నియోజకవర్గం రాప్తాడు వదిలి ధర్మవరంలో టికెట్ ఆశించిన శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో తనదైన గుర్తింపును సాధించుకున్నాడు.
ఇద్దరు యువ నాయకులు, ఇద్దరికీ ప్రజలలో మంచి పట్టు ఉంది. కేతిరెడ్డి భూకబ్జాలు చేస్తున్నాడని, ప్రభుత్వ స్థలాలు తన అనుచరులకు కట్టబెడుతన్నాడని టిడిపి విమర్శిస్తోంది. గతంలో టిడిపి హయాంలో పరిటాల ఫ్యామిలీ అనేక అక్రమాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరూ తగ్గడం లేదు. కేతిరెడ్డి అవినీతి తనకు కలిసి వస్తుందని పరిటాల భావిస్తుంటే, నియోజకవర్గం లో తన చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని కేతిరెడ్డి ధీమాతో ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ధర్మవరంలో పోటీ హోరా హోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.