కులగణన పై విమర్శల దాడిని బీసీలపై దాడిగానే భావిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారంలో ఉండగా బలహీనవర్గాలకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు విమర్శలు చేస్తే.. తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని సూచించారు. ఇవాళ మంత్రి పొన్నం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు.
కులగణన పై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని కోరారు. బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు. నిర్ణీత గడువులో కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రశంసించారు. కులగణనకు స్ఫూర్తినిచ్చిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాల్లోని బలహీన వర్గాల నాయకులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేను రేపు ఉదయం 8గంటలకు కేబినెట్, 11గంటల తరువాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.