హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 29న జరిగే పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య వార్మాప్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించి రాచకొండ పోలీసులు హెచ్ సీఏకి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రేక్షకులు లేకుండా కేవలం ఇరు దేశాల ఆటగాళ్లతోనే సన్నాహక మ్యాచ్ నిర్వహించాలని కోరారు. 28, 29 తేదీలలో గణేష్ నిమజ్జనంతో పాటు అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉందని.. ఈనెల 28న ఉదయం నుంచి 29వ తేదీ సాయంత్రం వరకు పోలీసులు అందరూ దాదాపు రహదారులపైనే విధులు నిర్వహించాల్సి ఉంటుందని హెచ్ సీఏ ధృష్టికి తీసుకెళ్లారు.
ఈ తరుణంలో 29న జరిగే పాక్-న్యూజిలాండ్ వార్మాప్ మ్యాచ్ కి సంబంధించి మైదానంలో భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. అందువల్ల కేవలం ఆటగాళ్లతోనే మ్యాచ్ నిర్వహించాలని సూచించారు.ఈ మ్యాచ్ కి సంబంధించి హెచ్సీఏఇప్పటికే 1500 టికెట్లను విక్రయించినట్టు సమాచారం. పోలీసుల సూచనలను హెచ్ సీఏ పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఫైనల్ గా ఈ మ్యాచ్ పై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.