కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయని ఆరోపించారు. వారి హయాంలో బాంబు పేలుళ్ల వంటి ఘటనలు చూశామని పేర్కొన్నారు. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోందని వ్యాఖ్యానించారు. వరంగల్లో పర్యటించిన ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.
“ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ఈ ప్రాంతం ప్రతీక. మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో బూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఎంపీల్లో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారు. ఈ ప్రాంత ప్రజలను బీజేపీ ఎన్నటికీ మరవదు. వరంగల్ ప్రజలు ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచారు. వికసిత్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారత్ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.” అని ప్రధాని మోదీ అన్నారు.