టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడిపై తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెంచినప్పుడు రైతులకు మద్దతుగా అప్పటి సీఎం చంద్రబాబునాయుడిని ఎదిరించింది నాటి డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. బషీర్‌బాగ్‌లో కాల్పులకు కేసీఆర్ కారణమని మాట్లాడటం రేవంత్ రెడ్డి తెలివితక్కువ తనానికి నిదర్శనమని మండిపడ్డారు.
“రైతులకు మూడు గంటల విద్యుత్తు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని రేవంత్ స్పష్టంగా చెప్పారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది చంద్రబాబే. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ నాయకులు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటు. 24 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదని ఒక సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌లో చూసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటం సరికాదు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు’’ అని పోచారం ధీమా వ్యక్తం చేశారు.