తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తన చైనా భాగస్వామి బీవైడీతో కలిసి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ రెండు సంస్థలూ కలిసి దాదాపు రూ.8,200 కోట్ల (1 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయా సంస్థలు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నాయి. విద్యుత్తుతో నడిచే హ్యాచ్‌బ్యాక్ నుంచి విలాసవంత కార్ల వరకు నూతన ప్లాంటులో తయారు చేయాలన్నది ఈ కంపెనీల ప్రతిపాదనగా ఉంది.
‘ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. దీనికి అంగీకారం రాగానే, పనులు ప్రారంభం అవుతాయ’ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 ఎకరాల స్థలాన్ని తీసుకోవడంతో పాటు, ప్లాంటు నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు అప్పగించింది కూడా.