తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, సీపీఎం, ఎంఐఎంలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజాగా మొయిన్‌బాగ్‌లో పర్యటించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఓ పోలీసుతో అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రోజు రాత్రి సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెయిన్‌బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ బందోబస్తు పర్యవేక్షించేందుకు వెళ్లిన సీఐ శివచంద్ర.. రాత్రి 10 గంటలు కావస్తుండటంతో స్టేజీపైకి వెళ్లారు.
సభకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉండటంతో.. ఆ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ శివచంద్ర ప్రయత్నించారు. అక్బరుద్దీన్ తనను చూసిన వెంటనే స్టేజీ దిగి వెళ్లాలని… తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు…. రెండు మతాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని సీఐ శివచంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది..