తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు నల్గొండ జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించడాన్ని ఖండించడానికే ఛలో నల్గొండ సభ నిర్వహిస్తున్నామని ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ బహిరంగ సభకు అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలకు స్పష్టం చేసిన గులాబీ దళపతి 12 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. గ్రామాల్లో చర్చించేందుకు వీలుగా యువత ఎక్కువగా తరలివచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.