ఇబ్రహీంపట్నం కేసును చేధించిన పోలీసులు..!

-

ఇబ్రహీంపట్నంలోని రాయపోల్ గ్రామంలో లో సోమవారం జరిగిన హత్య కేసును చేధించారు పోలీసులు. దారుణ హత్యకు గురైన లేడీ కానిస్టేబుల్ నాగమణి.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తుంది. మృతురాలు నాగమణికి ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. నాగమణికి 2014లో పటేల్ గూడా కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నాగమణికి పసుపు కుంకుమ కింద ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా ఇద్దరు 2022లో విడిపోయారు. అప్పటినుండి రాయపూర్ లోని తమ బంధువుల ఇంట్లో తన సోదరుడు పరమేష్ తో కలిసి ఉంటుంది. అదే సమయంలో రాయపోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాగమణిది శ్రీకాంత్ ది ఇద్దరిదీ వేరే కులం కావడంతో పెళ్లికి ఆమె సోదరుడు పరమేష్ ఒప్పుకోలేదు.

నాగమణిని తమ కులం కి చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఆమె సోదరుడు పరమేశు ఇతర కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. నాగమణికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్తో యాదగిరిగుట్ట లి నవంబర్ 10వ తేదీన కులాంతర వివాహం చేసుకుంది నాగమణి. పరమేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు తెలియకుండానే శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంది నాగమణి. కులాంతర వివాహం నాగమణి చేసుకోవడంతో గ్రామంలో పరమేష్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. దీంతో వనస్థలిపురం లోని సహారా ఎస్టేట్స్ లో నాగమణి శ్రీకాంత్లు కాపురం పెట్టారు. అవమాన భారం తట్టుకోలేకపోయిన పరమేష్ ఎలాగైనా నాగమణిని చంపాలి అనుకున్నాడు. ఇందుకోసం ఒక కత్తిని కొనుగోలు చేశాడు, నాగమణి గ్రామానికి ఎప్పుడొస్తుందని ఎదురు చూడ సాగాడు పరమేష్. ఈ క్రమంలో ఆదివారం తన భర్త శ్రీకాంత్తో కలిసి రాయపోల్ గ్రామానికి వచ్చింది నాగమణి. విషయం తెలుసుకున్న పరమేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. నాగమణిని చంపాలని పథకం రూపొందించాడు. అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో కలిసి ఆమె రాకపోకలు సమాచారం ఇవ్వాలని చెప్పాడు. సోమవారం ఉదయం 8:30 ప్రాంతంలో నాగమణి తన ఎలక్ట్రిక్ బైక్పై బైటికి వెళుతుందన్న విషయాన్ని శివ పరమేష్ కు చెప్పాడు. 9 గంటల ప్రాంతంలో మన్నెగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ దగ్గరకి నాగమణి స్కూటర్ రాగానే ఆమెని కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత అప్పటికే కొని పెట్టుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. నాగమణి భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసారు. ఇవాళ ఉదయం జనహర్ష వెంచర్ సమీపంలోని పోల్కంపల్లి గ్రామ పరిధిలో పరమేశ్ ను పట్టుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version