నేటి నుంచి మళ్లీ ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 6వ తేదీ వరకు గ్రామ, వార్డుల్లో సభలు కొనసాగనున్నాయి. ప్రజాపాలనలో ఇప్పటివరకు 40.57 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్లు, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులపై ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇప్పటికే పింఛను, రైతుబంధు వస్తున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్, 2,500, గృహ జ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల కొరతతో చాలామంది బయట కొనుగోలు చేస్తున్నారు. దరఖాస్తులను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.