తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రజా దర్బార్ నిర్వహిస్తోంది. అయితే మొదట ప్రజా దర్బార్ అని పెట్టిన పేరును తాజాగా ప్రజా వాణిగా మార్చింది. ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ ప్రజా వాణి కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 10.00 గంటల లోపు ప్రజా భవన్కు వచ్చిన వారిని లోనికి అనుమతించాలని ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇవాళ్టి ప్రజావాణికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. కిలో మీటరు దూరం వరకు బారులు తీరిన అర్జీదారులు.. తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్దఎత్తున జనాలు రావడంతో…ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామైంది. వాహనాలను క్రమబద్దీకరిస్తున్న పోలీసులు…. అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.