ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత గారి పాత్ర ఉన్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనాన్ని రాశారని, ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయి, బెయిల్ పొందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని, శరత్ చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, కాకినాడ ఎస్ఇజెడ్, కాకినాడ పోర్టులో అత్యధిక వాటా శరత్ చంద్రారెడ్డి గారికి చెందిన కంపెనీలదేనని అన్నారు ఎంపీ రఘురామ. ఆడాన్ డిస్టలరీస్ పేరిట రాష్ట్రంలో అధిక మద్యాన్ని విక్రయిస్తున్నారని, తమ పార్టీ కీలక నాయకుడైన విజయసాయిరెడ్డి గారి అల్లుడి అన్ననే ఈ శరత్ చంద్రారెడ్డి అని అన్నారు.
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారబోతున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు రోజుల క్రితమే వార్తా కథనాన్ని రాసిందని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో చెప్పినట్టుగానే సీబీఐ కోర్టులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని, నిందితులే ఏ కేసులోనైనా అప్రూవర్ గా మారాలంటే మారవచ్చు గాని, సాక్షులు అప్రూవర్ గా మారరని అన్నారు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారితే జగన్ మోహన్ రెడ్డి గాయూ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు అభ్యంతరం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని వెల్లడించారు.
ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని జైల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత గారు పిటిషన్ దాఖలు చేస్తే, శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేస్తారా?. చేయరు కదా… అలాగే అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా బెయిల్ ఇచ్చి, బయట తిరిగే స్వేచ్ఛను కల్పించారని అన్నారు. ఈ రెండు కేసులు వేరు వేరైనా, వాటి మధ్యనున్న సారుప్యాన్ని మాత్రమే పరిశీలించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొందరి పేర్లు చెప్పాలని అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డికి సూచించినట్లు తెలిసిందన్నారు.