తెలంగాణ ఇస్తామని 2004లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియాగాంధీ సాకారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఇప్పుడు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో ఇందిరా, సోనియా, రాజీవ్, తనకు ఉంది రాజకీయ సంబంధం కాదని.. గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య ఉంది ప్రేమానుబంధాల బంధం అని రాహుల్ గాంధీ తెలిపారు. భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
“తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్‌ను ఏర్పాటు చేస్తాం.సీఎం, ఆయన పరివారం సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతాం. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేశాం. కర్ణాటకలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం. రాజస్థాన్‌లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కింద రూ.25 లక్షల ప్రయోజనం చేకూర్చాం. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ అమలైందా?” అని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.