కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం రోజున తెలంగాణలో పర్యటించనున్నారు. ఖమ్మం వేదికగా నిర్వహించే కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హజరవనున్నారు. ఈ మేరకు సభకు ఆ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరికతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ నాయకత్వమంతా ఖమ్మంపై ప్రధాన దృష్టి సారించి సభ విజయవంతానికి నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది.
అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఆ సభను విజయవంతం చేసి.. కాంగ్రెస్ సత్తా చాటుతామని నేతలు అంటున్నారు. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ జన గర్జన సభ.. బీఆర్ఎస్కు రాజకీయ సమాధి కాబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి.. సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.