నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తుంటే.. మరోవైపు బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, జేపీ నడ్డా.. ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లి కార్జున ఖర్గే, సిద్దరామయ్య, డి.కే.శివకుమార్, రేవంత్ రెడ్డి వంటి నాయకులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం మణుగూరుకు రానున్నారు. సీపీఐ బలపర్చిన పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన రోడ్‌షో, స్ట్రీట్ మీటింగ్‌ల్లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు మణుగూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నేత బీ అయోధ్య, డీసీసీబీ డైరక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించి రాహుల్ పర్యటన వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పినపాకతో పాటు ఉమ్మడిజిల్లాల్లో కాంగ్రెస్ విజయం కోసం రాహుల్ ప్రచారం చేయబోతున్నారని, శుక్రవారం ఉదయం 10గంటలకు మణుగూరులో రోడ్ షో, ఆ తర్వాత జరిగే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.