ఓవైపు భానుడి సెగలతో ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. భాగ్యనగరంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాసేపటికే కురిసిన వానతో నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో సాధారణంగానే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఇక రోడ్లపైకి వరద చేరడంతో భారీగా రద్ది ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉక్కపోతతో విలవిలలాడుతుండగా.. వర్షం రావడం కాస్త ఉపశమనం కలిగించేలా ఉందని నగర వాసులు అంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని వెల్లడించారు.