ఖగోళంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. అయితే మరో అద్భుతమైన దృశ్యం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని రెండు గ్రహాలు, నెలవంక (చంద్రుడు) సమీపంలోకి రానుండటంతో ఆకాశంలో ‘స్మైలీ ఫేస్’ ఆకారం ఏర్పడనుంది. ఏప్రిల్ 25వ తేదీన ఈ అద్భుత దృశ్యం కనిపించనుందని సైన్స్ వెబ్‌సైట్ లైవ్‌సైన్స్ వెల్లడించింది.
ఏప్రిల్ 25న తెల్లవారుజాముకు ముందు శుక్రుడు, శని, నెలవంక అతి సమీపంలోకి రానున్నాయి. ఒక దగ్గరే కనిపించనున్న ఆ మూడు.. స్మైలీ ఫేస్ ఆకృతిని ప్రతిబింబించనున్నట్లు సైన్స్ వెబ్ సైట్ లైవ్ సైన్స్ తెలిపింది. సూర్యోదయానికి ముందు అతి కొద్ది సమయం మాత్రమే ఈ దృశ్యం కనువిందు చేయనుంది. శుక్రుడు, శని ప్రకాశవంతంగా ఉండటంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చని.. స్మైల్ ఇమేజ్‌ను చూసేందుకు మాత్రం స్టార్‌గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ వినియోగించాలని ఓ మీడియా కథనం పేర్కొంది.