తెలంగాణలో పగలూ సాయంత్రం వాతావరణం భిన్నంగా ఉంటుంది. పగటిపూట మే నెలలో మండుతున్నట్లు సూర్యుడు భగభగలాడుతుంటే.. సాయంత్రం సమయంలో మాత్రం చల్లని గాలులతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఇప్పటివరకు సరైన వానలు కురవడం లేదు. ఇక రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక శనివారం రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీ మీటర్ల భారీ వర్షం కురవగా.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెం.మీ. వర్షం పడింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.