రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా వద్ద సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.