గుడ్ న్యూస్.. మరో 4.6 లక్షల కుటుంబాలకు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌

-

రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్. మరో 4.6 లక్షల కుటుంబాలకు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా ఇస్తున్న రాయితీ సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్య తాజాగా 44,10,816 కుటుంబాలకు చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 39,50,884గా ఉండగా.. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారులు గణనీయంగా పెరిగారు.

మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 5వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 76.64 లక్షల సిలిండర్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేసింది. గ్యాస్‌ వినియోగదారులకు రూ.227.42 కోట్ల రాయితీ చెల్లించిందని పౌరసరఫరాల శాఖ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం 44,10,816 కుటుంబాలు గ్యాస్‌ లబ్ధిదారులుగా ఉంటే.. ఇందులో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 4,23,993 కుటుంబాలు ఉన్నాయని తెలిపాయి. ఆ తర్వాత నల్గొండలో 2,38,251, ఖమ్మం 2,31,898, నిజామాబాద్‌ 2,24,865 కుటుంబాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నాయి. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 60,934, భూపాలపల్లి 65,258, వనపర్తి 73,768, ఆసిఫాబాద్‌లో 74,347 కుటుంబాలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నాయని పౌరశాఖ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news