హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేరిట ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో పార్కర్ పెన్ను ఆర్డర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్టు వ్యవహారంలో న్యాయస్థానంలో త్వరగా కౌంటరు దాఖలు చేయాలంటూ న్యాయవాది కరుణా సాగర్.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట పార్కర్ పెన్ను ఆర్డర్ చేశారు. రాజాసింగ్‌పై పీడీ యాక్టు నమోదు చేయడంపై విచారణ సందర్భంగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ 1,650 పేజీలతో కౌంటరు సిద్ధం చేశామని, దానిపై సంతకాలు చేసి కోర్టులో సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. న్యాయస్థానం విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పీడీ యాక్టు కౌంటర్‌పై నగర కమిషనర్ త్వరగా సంతకం చేయాలంటూ న్యాయవాది కరుణా సాగర్ రూ.357 ఖరీదైన పార్కర్ పెన్ను, రీఫిల్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం పేరిట ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేశారు. అందిన తర్వాతే డబ్బు చెల్లించేలా ఆర్డర్ పెట్టారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.