పార్లమెంట్ ఎన్నికల రాజకీయం తెలంగాణలో రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఓవైపు పార్టీ కీలక నేతలు విమర్శలు ప్రతివిమర్శలతో కాక పుట్టిస్తుంటే.. మరోవైపు ఎంపీ అభ్యర్థులు పరస్పర ఆరోపణలతో మరింత హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చేవెళ్ల రాజకీయం రంజుగా మారింది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. కోళ్లదాణా, భూకబ్జా, అవినీతిలాంటి ఆరోపణలు చేస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి.. ఆధారాలుంటే బయటపెట్టాలని రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం అవినీతి బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారని.. ఈ సారి కూడా ఆయనకు చేవెళ్లలో పరాభావం తప్పదని అన్నారు. మరోవైపు తాను పార్టీ మారటం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన రంజిత్ రెడ్డి.. కేటీఆర్ చుట్టూ ఉన్న వారిలో పార్టీలు మారిన వారే లేరా అని ప్రశ్నించారు.