కరోనా న్యూ వేరియంట్ భారత్లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కేరళలో ఈ వేరియంట్ విజృంభిస్తోంది. అక్కడి సర్కార్ అప్రమత్తమై వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు చేపడుతోంది. మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా తెలంగాణలో గడచిన 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం 402 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని.. అందులో కేవలం 4 మాత్రమే పాజిటివ్ వచ్చినట్టుపేర్కొంది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా న్యూ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. స్వీయ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని, కరోనా నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.