30 లక్షలకు చేరుకున్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు

-

తెలంగాణ‌లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ప్ర‌భుత్వం వేగం పెంచింది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 55,359 టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 30 లక్ష లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రతి రోజు 55 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇదే జోరును కొన సాగిస్తూ.. అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచాల‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తున్న‌ది. గత రెండు నెలల వ్యవధిలో ఏకంగా రాష్ట్రంలో 25 లక్షల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రాష్ట్రంలో తొలి కేసు నమోదై రేపటికి సరిగ్గా 8 నెలలు అవుతుంది. ఇందులో తొలి ఐదు నెలల వ్యవధిలో కేవలం 4,58,592 పరీక్షలు మాత్ర‌మే చేయగా, గత 60 రోజుల్లో ఏకంగా 25,37,408 టెస్టులు చేయ‌డం గ‌మ‌నార్హం.


కాగా, రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 2,103 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో పాజిటివ్‌ల సంఖ్య మొత్తం 1,91,386 కు చేరుకుంది. మరో 2,243 మంది ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,60,933కి చేరుకుంది. మరో వైపు ప్రతి పది లక్షల జనాభాకు చేసే పరీక్షల సంఖ్య 80,494కు చేరుకుంది. వైరస్‌ కారణంగా మరో 11 మంది కన్నుమూయడంతో కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 1,127కు చేరుకుంది. ఇక తాజ‌గా రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆయనకు రెండు రోజుల క్రితం దగ్గు, జలుబు రావడంతో బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా ‘పాజిటివ్‌’ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news