ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన మరవక ముందే అదే రాష్ట్రంలో మరో దళిత మహిళపై లైంగికదాడి జరగడం కలకలం రేపుతోంది. హత్రాస్ కు 500 కి.మీ. దూరంలో గల బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ దళిత మహిళ రోజులానే నిన్న కూడా పనికి వెళ్లింది. అయితే సమయానికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్ బాటిల్‌తో ఈ-రిక్షాలో సదరు మహిళ ఇంటికి చేరింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆకరి క్షణాల్లో ఉన్న ఆమెను లక్నోకు తీసుకెళ్తుండగా, బల్‌రామ్‌పూర్ నగరం దాటకముందే తుది శ్వాస విడిచింది. ఆమెకు పోస్టుమార్టం చేయగా, ఆమెకు మత్తు మందు ఇచ్చారని, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిపోర్టులో తేలింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతోపాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు వెల్లడించారు. కాగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, నిందితులను అరెస్టు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.