రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం హుజూర్ నగర్‌లోని రేషన్ దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు. డీలర్ ను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కిలోల బియ్యం అందుతుందన్నారు.
అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతీ నెలా 6 కిలోల బియ్యాన్ని అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ల నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ. 39 అని అన్నారు. అయితే, దాదాపు 70-75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు మరియు ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. బియ్యం రీసైక్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఉత్తమ్.