తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వర్షపాతం అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరు బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. నిన్న రాత్రి విపరీతంగా వర్షం కురవడంతో రోడ్లమీద వెళ్లే ప్రయాణికులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరూ కూడా ఈరోజు బయటకు రాకూడదని నిపుణులు సూచనలు జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.