మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 7:30 గంటలకు ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లు ఓపెన్ చేస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఉదయం 8:30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్ల ఏర్పాటు చేయగా, 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
EVM కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఎన్నికల నిబంధనావలి 1961 యొక్క నియమం 56 (D) ప్రకారం లెక్కించుటకు అనుమతించిన మరియు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని ప్రదర్శించని పోలింగ్ స్టేషన్‌లను మినహాయించి డ్రా పద్దతి ద్వారా తప్పనిసరిగా 5 పోలింగ్ స్టేషన్ల VVPAT ల స్లిప్‌లను VCB (VVPAT కౌంటింగ్ బూత్) నందు లెక్కించబడును . 150 మంది సీటింగ్ కెపాసిటీతో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రెండింటికీ ప్రత్యేక హాలు ఏర్పాటు చేయబడింది . ఓట్ల లెక్కింపు రోజు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించటమైనది. వారిలో 100 మంది సిబ్బందిని కేవలము ఓట్ల లెక్కింపు కోసము మరియు 150 మంది సిబ్బందిని ఇతర కార్యకలాపాల కోసం నియమించటమైనదని ఈ మేరకు ఎన్నికల సంఘం పత్రిక ప్రకటనను విడుదల చేసింది.