మరికొన్ని క్షణాల్లో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అతిథులంతా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో స్టేడియం వద్దకు రానున్నారు. ఇవాళ ఉదయం ఆయన తన నివాసం నుంచి శంషాబాద్‌కు వెళ్లి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీలకు ఘనస్వాగతం పలికారు.
ఆ తర్వాత వారిని తాజ్‌కృష్ణా హోటల్ వద్ద డ్రాప్ చేసి తన నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రేవంత్ రెడ్డి బయల్దేరారు. మార్గమధ్యలో గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు.
మరోవైపు ప్రమాణ స్వీకారం సమయం సమీపిస్తున్నందున గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.