తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. పంటల బీమా పథకం అమలు పైనా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికే ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులకు నష్టం కలుగుతోందని తుమ్మల అన్నారు. రాష్ట్రాల అవసరాలు పోను మిగిలిన వాటి ఎగుమతికి అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. రేషన్ ద్వారా ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పెద్దగా ఎవరూ వాడకపోవడంతో వాటినే కేంద్రం ‘భారత్ బ్రాండ్’ పేరిట కిలో రూ.29కి విక్రయిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కిలో రూపాయికే పంపిణీ చేయాలి లేదా రూ.29కి సన్న బియ్యం విక్రయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సాగులో 60 శాతం వరే ఉందని.. వరి పండించే రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో ముందే చెబితే అవే ఎక్కువగా పండించే అవకాశం ఉంటుందని.. తద్వారా ఎగుమతులు సులభతరమవుతాయని అభిప్రాయపడ్డారు.