నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. కలెక్షన్లలోనూ ఈ మూవీ దూసుకెళ్లింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓ ముగ్గురు స్టార్ హీరోలు రీమేక్ చేయాలనుకుంటున్నారట. అదేంటి ఒకే సినిమాను ముగ్గురెలా రీమేక్ చేస్తారనుకుంటున్నారా ఆ సంగతేంటో ఓసారి చదివేద్దాం రండి.
భగవంత్ కేసరి మూవీకి తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో భారీగా డిమాండ్ ఉందని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రాన్ని ఆయా ఇండస్ట్రీల హీరోలు రీమేక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. ముఖ్యంగా రీమేక్ లతో సూపర్ హిట్లు కొట్టిన తమిళ దళపతి విజయ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆశపడుతున్నాడట. ఇటీవలే రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇలాంటి స్టోరీ అయితే ఇటు కెరీర్ కు అటు పాలిటిక్స్ కు ఉపయోగపడుతుందని విజయ్ అభిప్రాయపడినట్లు టాక్. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర విజయ్‌కు బాగా నచ్చిందని అంటున్నారు.
మరోవైపు ఈ స్టోరీని సూపర్ స్టార్ రజనీ కాంత్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడాయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇది కాస్త డౌటే. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాపై మనసు పారేసుకున్నారట. మరి ఈ చిత్ర రీమేక్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.