రాష్ట్రంలో బీసీ కుల వృత్తిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా.. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆదాయపత్రాల కోసం తాసిల్దారు కార్యాలయాలకు జనం పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.
అయితే కుల దృవీకరణ పత్రాలు లేని వారు, కనీసం ఆదాయపత్రాలు లేని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న అవి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తు గడువు పొడగించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇవాల్టి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూలై 15వ తేదీన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. బీసీ రుణాల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు.