మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ ముప్పు చంద్రబాబు నుంచే ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలని అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు అని చెప్పారు. జగన్ కి పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు.
చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం కలిగిందని.. జగన్ పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ కళ్యాణ్ అదే చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. వంగవీటి మోహనరంగా హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం కూడా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైసీపీ పైకి నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే 175 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు.