ద‌స‌రా ఆప‌రేష‌న్స్‌పై పోలీస్, రవాణా శాఖల అధికారులతో ఆర్టీసీ సమావేశం..!

-

స‌ద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్ల‌కు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి స‌హ‌క‌రించాల‌ని పోలీస్, ర‌వాణా శాఖ‌ల అధికారుల‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ కోరారు. గ‌త‌ ద‌స‌రాతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని ఆయన కోరారు. ద‌సరా ఆప‌రేష‌న్స్‌పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి వారికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ఆర్టీసీ అధికారులు వివ‌రించారు.

పండుగ స‌మ‌యాల్లో ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేసేందుకు టీజీఎస్ఆర్టీసీకి పోలీస్, ర‌వాణా శాఖ‌లు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. సంస్థ వృద్దిలో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంద‌ని అన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్ర‌జ‌ల‌కు సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు. ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news