జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు (Rythu Bandhu) సాయం అందజేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జూన్ 10 వరకు పట్టాదార్ పాస్ బుక్‌లు పొంది సీసీఎల్ఎ ద్వారా ధరణి పోర్టల్ లో చేర్చబడి అర్హులైన రైతులందరికీ రైతుబంధు సాయం అందుతుందని అన్నారు.
పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారిన రైతుల ఖాతాలలోకి కూడా నిధులు జమ చేయబడతాయని మంత్రి వివరణ ఇచ్చారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రైతులందరికీ వారి ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయబడుతుందని అన్నారు.
ఇక జూన్ 10 లోపు మొదటిసారి పట్టాదారు పాస్ బుక్‌లు పొందిన రైతుల బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తారని… దీని కోసం రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. సదరు రైతులు తమ బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు బుక్, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయాధికారులకు అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు.