రైతు బంధు చెల్లింపులు 3వేల 3వందల కోట్ల రూపాయలు దాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం రోజున భారీగానే చెల్లింపులు చేసినట్లు చెప్పాయి. ఇప్పటి 9 వందల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికీ తమకు రైతు బంధు నిధులు అందలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుబంధు చెల్లింపులు పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చేనెల చివరికల్లా రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. ఇ కనుంచి వారంలో మూడు రోజులు ప్రజల్లోకి వెళతానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీల అమలును ప్రారంభిస్తామని ప్రకటించారు.