వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారందరికీ ‘రైతు భరోసా’ అమలు చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని వెల్లడించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్న తుమ్మల.. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
“పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయడం ఖాయం. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న, సన్నకారు రైతులందరికీ రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తాం. కేంద్రం కొన్నా.. కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతాం. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునేలా పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుంది.” అని మంత్రి తుమ్మల తెలిపారు.