తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ శాసనసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు.. కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు.
“కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని.. పోరాడాల్సిందేనని కేటీఆర్ అన్నారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు. సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. తాము కూడా అప్పట్లో కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నామని.. అయినా ఏం రాలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్ర సర్కార్ ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మక్క – సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం.. సమ్మక్క – సారలమ్మ జాతరకు ఎందుకు ఇవ్వదని కేటీఆర్” నిలదీశారు.