70 ఏళ్లు పైబడిన వృద్ధులను సైతం ఆయుష్మాన్ పథకం కింద చేర్చాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.70 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నదని కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్ గతంలో పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరనుంది. వారి సామాజిక,ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కనుంది.
దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. 70ఏళ్లు పైబడిన వారు 5 లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.