వికారాబాద్ జిల్లా సుల్తాన్‌పూర్‌లో పెను ప్రమాదం తప్పింది. పదుల సంఖ్యలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. అసలేం జరిగిందంటే..?
వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తోంది. ఇంటింటికి వెళ్లి విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని ఇక స్కూల్కు బయల్దేరింది. మార్గ మధ్యలో సుల్తాన్పూర్ వద్దకు రాగానే బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో విద్యార్థులెవరికీ ఏం జరగలేదు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వాహనంలోని 40 మంది విద్యార్థులను కాపాడారు. స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తమ పిల్లలకేదైనా జరిగిందేమోనని ఆందోళన చెందారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల యాజమాన్యానికి అతడిపై ఫిర్యాదు చేశారు.