వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులకు రోజూ ఇంట్లో నుంచే పని చేయాలంటే బోర్. సరే అని ఏ పార్కులోనో.. కెఫేలోనో చేద్దామంటూ రణగొణధ్వనుల మధ్య పనిపై ఏకాగ్రత కుదరదు. అందుకే వీరి కోసం తెలంగాణ సర్కార్ ఓ యోచన చేసింది. నిత్యం హోటళ్లు, ప్రైవేటు వసతి గృహాలతో కిక్కిరిసిపోయిన హైటెక్‌సిటీలో అందమైన పార్కును తీర్చిదిద్దింది.
ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు పేరుతో మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి దగ్గర్లోని పత్రికానగర్‌లో దీన్ని నిర్మించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్లతో జీహెచ్‌ఎంసీ ఉద్యానాన్ని అభివృద్ధి చేసినట్లు పట్టణ జీవ వైవిధ్య విభాగం(యూబీడీ) అదనపు కమిషనర్ కృష్ణ వెల్లడించారు. త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. పార్కు నుంచి విధులు నిర్వర్తించేందుకు టెకీలు సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చారు. సైన్స్ పార్కులో కూర్చుని ల్యాప్‌టాప్‌తో పనిచేసుకునే బెంచీలు, ఆట వస్తువులు, క్రీడా సదుపాయాలు, బహిరంగ వ్యాయామశాలల వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అందరికీ వినోదాన్ని పంచేలా ఉద్యానాన్ని అభివృద్ధి చేశామని కృష్ణ వివరించారు.