సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైలు టికెట్ ధరలు ఎంతో తెలుసుకోవాలని ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ టికెట్ల ధరలు ఖరారయ్యాయి.
దూరాన్ని, ప్రయాణించే బోగీని బట్టి కనిష్ఠ టికెట్ ధర రూ.470 కాగా, గరిష్ఠంగా రూ.3,080. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్‌కార్ టికెట్ ధర రూ. 1,680గా నిర్ణయించారు. ప్రయాణికులకు తిరుపతి-సికింద్రాబాద్ రైలు 9వ తేదీ, సికింద్రాబాద్-తిరుపతి రైలు 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
సికింద్రాబాద్‌లో ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం నుంచి బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. తిరుపతి నుంచి బయల్దేరే రైలు తొలిరోజు 9న ఏసీ ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో సీట్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్‌కు చేరింది. అలాగే సికింద్రాబాద్ నుంచి 10న ప్రయాణానికి ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో సీట్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్టుకి చేరగా.. ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో మాత్రం 172 సీట్లున్నాయి (శుక్రవారం రాత్రి 10 గంటల వరకు).