కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జనహిత పాదయాత్రపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జనహిత పాదయాత్ర కాదని.. జనరహిత యాత్రగా విమర్శలు చేశారు. ఇది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాకుండా రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన నాటకమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘డమ్మీ సీఎం’ అంటూ ఆయన పదవి కాపాడుకోవడానికి ఢిల్లీలో హైకమాండ్ను బుజ్జగించేందుకు తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, అక్కడే ‘ప్యాలెస్ ‘ ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో షాడో సీఎం మీనాక్షీ నటరాజన్ పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ వంటి కాంగ్రెస్ హామీలు అమలుకు నోచుకోకుండా ‘కోమాలోకి’ వెళ్లాయని, రైతు డిక్లరేషన్కు ‘ఉప్పుపాతర’ వేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలనగా మారిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపించారు.