హైదరాబాద్ ప్రజా భవన్(పూర్వ ప్రగతి భవన్) వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో బారికేడ్లను ధ్వంసం చేసి హల్ చల్ సృష్టించాడు. ఈ కేసులో వేరే వ్యక్తిని తన స్థానంలో ఇరికించాలని విఫలయత్నం చేసి చివరకు దుబాయ్ పారిపోయాడు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టులో దాఖలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సాహిల్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ మంగళవారం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలాంటి ఆధారాల్లేకుండా కేసు నమోదు చేశారని అన్నారు. ఏపీపీ సుదర్శన్ సారా వాదనలు వినిపిస్తూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడానికి నిందితుడు అందుబాటులో లేరని, దుబాయ్‌లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీలోగా నిందితుడు దర్యాప్తు అధికారి ముందు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇవ్వబోగా.. సాహిల్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని కోరారు. న్యాయమూర్తి అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.