ఏకకాలంలో రుణమాఫీ అనేది ఒక మోసమని దీనిని సభలో ఎండగట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఇందుకోసం మంగళవారం రోజున బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. నిరుద్యోగుల సమస్యలు – అక్రమ అరెస్టులు, హామీలు అమల్లో వైఫల్యం, రుణమాఫీ, పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు, నకిలీ మద్యం వ్యవహారం, ఆర్టీసీ విలీనం, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదల, పెన్షన్లు, శాంతి భద్రతలు, విదేశీ విద్యానిధి, తదితర అంశాలను ఉభయసభల్లో లేవనెత్తాలని నేతలకు కేసీఆర్ సూచించారు.
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నేపల్లి పర్యటనకు వెళ్లాలని పార్టీ శాసనసభా పక్షం నిర్ణయించింది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల విషయమై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామని తెలిపారు. మరోవైపు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.