నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆర్నెళ్ల చిన్నారి మిస్సింగ్

-

హైదరాబాద్ నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆరు నెలల పసికందు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. ఫైజల్‌ ఖాన్ అనే బాలుడిని గురువారం రాత్రి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం. ఆందోళన చెందిన చిన్నారి తల్లి ఫరీదా చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

తన పెద్ద కుమారుడికి జ్వరం రావడంతో గురువారం మధ్యాహ్నం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చామని ఫరీదా తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ చేశామని.. ఆర్నేళ్ల వయసున్న తన చిన్న కుమారుడు ఫైజల్‌ఖాన్‌ను తీసుకుని వార్డు బయట ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో ఓ మహిళ తన వద్దకు వచ్చి మాట్లాడిందని.. తన రెండు నెలల బాబును తీసుకొని ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పిందని తెలిపారు. అనంతరం భోజనం కోసం ఫైజల్‌ ఖాన్‌ను వార్డులో పడుకోబెట్టి వెళ్లి.. 15 నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి బాబు కనిపించలేదని వాపోయారు. తనతో మాట్లాడిన మహిళ కూడా కనిపించకపోవడంతో ఆమే ఎత్తుకెళ్లినట్లు అనుమానం ఉందని పోలీసుల ఫిర్యాదులో ఫరీదా పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తన బాబును కనిపెట్టాలని పోలీసులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news