ఖమ్మం కాంగ్రెస్ గరంగరంగా ఉంది. కాంగ్రెస్ కచ్చితంగా ఆధిక్యం సాధించే జిల్లా ఖమ్మం. కానీ అక్కడ వర్గ విభేదాలు అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రెండు వర్గాలు అయితే మాట్లాడి రాజీ చేయవచ్చు, కానీ ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇప్పుడు కొత్తగా తుమ్మల నాగేశ్వరరావు వర్గం ఎంట్రీ ఇస్తుంది.
నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ పోరు కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశంలో మళ్లీ బట్టబయిలయ్యాయి. ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్, మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా నసీం ఖాన్, భట్టి విక్రమార్క, రేణుక చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విహెచ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సమావేశం రసాభాసగా మారింది. విహెచ్ మాట్లాడుతుంటే రేణుకా చౌదరి వర్గీయులు మా నియోజకవర్గంలో నీకేం పని అంటూ ఆందోళన చేయగా విహెచ్ కోపంతో మైక్ విసిరేసి, మాట్లాడడం ఆపేశారు. ఈ గొడవను చూసి బట్టి విక్రమార్క మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు . పోట్ల, రాయల వర్గీయులు టికెట్ విషయంలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని ఆందోళనకు దిగారు. పార్టీని నమ్ముకుని అన్ని విధాలుగా నష్టపోయిన వారికి పార్టీలో గుర్తింపు లేదని రేణుకా చౌదరి విమర్శలు చేశారు.
నియోజకవర్గంలో అందరితో సంప్రదింపులు జరిపి అభ్యర్థిని ప్రకటిస్తామని నశింఖాన్ సమావేశంలో అందరికీ సర్ది చెప్పారు. ఈ రచ్చ చూసిన వారందరూ ఈసారి ఖమ్మం కాంగ్రెస్ కు దక్కుతుందా?? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇటీవలే జరిగిన రచ్చ. ఇది ఇలాగే కొనసాగితే ఖమ్మంలో కాంగ్రెస్‌కు నష్టం తప్పదు. గెలిచే సీట్లని చేతులారా పోగొట్టుకున్నట్లే.